రాముడికి సీత ఏమవుతుంది

పుస్తక పరిచయము : రాముడికి సీత ఏమవుతుంది
రచయిత : ఆరుద్ర
వెల : యాభయి రూపాయలు

రాముడికి సీత ఏమవుతుంది? ఈ ప్రశ్నకి జవాబు అందరికి తెలుసు కాని చాలా దేశాలలో చాలా రామాయణాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకున్నాక ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అని తెలుస్తుంది.

మన దేశములో మన అందరికి తెలిసినది వాల్మీకి రామాయణము. దీనినే శ్రీ మద్రామాయణము అంటారు. ఇందులో ఆరు ఖండాలున్నాయి. మొత్తము ఇరువది నాలుగు వేల శ్లోకాలున్నాయి. మన ప్రాచీన భారత దేశానికీ చాలా దేశాలతో వర్తక వాణిజ్య సంభంధాలు ఉండేవి. అలా రామ కథ ఆసియా ఖండమంత అలుముకొంది. శ్రీలంక, టిబెట్, ఖోటాను, మంగోలియా, సైబీరియా, చైనా, జపాను, చంప, కంబోడియా,తైలాండ్, ఇండోనేసియా, మలేషియా, ఫిలిప్పీన్స్, బర్మా దేశాలలో రామాయణ గాధ చాలా ప్రాచుర్యములో ఉన్నది. ఈ కథలలో వాల్మీకి రామాయణములో లేని విషయాలు ఎన్నో ఉన్నాయి.

బౌధ రామాయణములో రాముడికి సీత చెల్లెలు. ఒక్క చెల్లెలే కాదు భార్య కూడా. ఖోటాను రామాయణములో రామలక్ష్మణులు ఇద్దరికీ భార్య. లావోసు రామాయణములో హనుమంతుడు రాముని కొడుకు. మలేషియా రామాయణములో మండోదరి దశరథుని పెద్ద భార్య. సీత రావణుని కూతురు. దశరథుని కొడుకు రావణాసురుని పుత్రికని పెళ్ళాడి రావణాసురుని చంపుతాడు. ఆ పుత్రిక పుత్రకామేష్టి లో పవిత్రమయిన ఒక అన్నము ముద్ద వల్ల పుట్టినదే. విద్దురలలాగా కనబడే ఈ విభిన్న రామాయణం కథలను శ్రధగా పరిశీలించాలి.

జైన రామాయణము ప్రకారము రామునికి నలుగురు భార్యలు. సీత, ప్రభావతి, రతినిభ, శ్రీరమ అని వాళ్ళ పేర్లు. లక్ష్మణునికి ఎనిమిదిమంది భార్యలున్నారు. బౌధ రామాయణము ప్రకారము దశరథుని పట్టపు రాణి ద్వారా ఇద్దరు కొడుకులు ఒక కూతురు పుట్టారు. వాళ్ళే రామ పండితుడు, లక్ష్మణ పండితుడు. కుమార్తె పేరు సీతాదేవి. ఇంకొక భార్య కొడుకు భరతుడు. దీనిలో ఆఖరున సీతాదేవిని, రామపండితుడు, లక్ష్మణ పండితుడు వివాహ మాడుతారు.

కాని మనకు ప్రామాణికము వాల్మికి రామాయణము మాత్రమే.

ఆసియా ఖండములోని వివిధ దేశాలలోని రామాయణాన్ని తెలుసుకోవాలంటే ఈ పుస్తకము చదవాలి.

Comments

Post a Comment